రాయలసీమకు ప్రత్యేక ప్రణాళిక!... 2 గంటల పాటు వైసీపీ ఎంపీకి వివరించిన సీనియర్ ఐఏఎస్!
కరవు సీమ రాయలసీమ తాగు, సాగునీటి సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోందట. ఈ మేరకు నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ లతో వైసీపీ యువ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వరుస భేటీల సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని అవినాశ్ రెడ్డి... ఎస్పీ టక్కర్ ను కలిశారు. శ్రీశైలం జలాశయంలో 874 అడుగుల మేర నీరు చేరేదాకా నాగార్జున సాగర్ కు నీటిని వదలరాదని అవినాశ్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన టక్కర్... జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తో భేటీ కావాలని వారికి సూచించారు. దీంతో వారు నేరుగా శశిభూషణ్ కుమార్ వద్దకు వెళ్లారు.
వైసీపీ ప్రజాప్రతినిధులను తన కార్యాలయంలో కూర్చోబెట్టిన శశిభూషణ్ కుమార్... సుమారు రెండు గంటల పాటు వారితో మాట్లాడారు. రాయలసీమ తాగు, సాగునీటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కసరత్తును ఆయన వారికి వివరించారు. వరుసగా నాలుగేళ్ల పాటు వర్షాభావ పరిస్థితులు ఎదురైనా సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని తమకు సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారని ఆయన వారికి చెప్పారు. ప్రస్తుతం ఆ పనిలో తాము బిజీగా ఉన్నామని కూడా చెప్పుకొచ్చారు. శశిభూషణ్ సుదీర్ఘ వివరణను సాంతం ఆసక్తిగా విన్న అవినాశ్ రెడ్డి బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.